సోమవారం, 4 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 నవంబరు 2021 (22:45 IST)

సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న టమోటా ధరలు

దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు తలపట్టుకుంటున్నారు. కిలో టమోటా ధర రూ.140కి చేరుకోవడంతో సామాన్యులు వాపోతున్నారు. వర్షాలు, వరదల కారణంగా దిగుబడి సరిగా రాకపోవటంతో తీవ్రమైన టమాటా కొరత ఇప్పుడు దేశాన్ని వేధిస్తుంది. ఏ రాష్ట్రంలో చూసినా టమాటాలకు ఇబ్బంది ఉంది. 
 
టమాటాలకు అతిపెద్ద మార్కెట్ అయిన కోలార్ లో కూడా టమాటా ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. 15 కిలోల టమాటాల బాక్స్ వెయ్యి రూపాయలకు పైగా పలుకుతుంది. కూరగాయలలోనే అత్యధిక వినియోగం ఉండే టమాటా ధరలు చుక్కల్లో ఉండటంతో ధరలను తగ్గించాలని ప్రభుత్వాలకు సామాన్య ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ టమాట ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న విపరీతమైన వర్షాలు, వరదలు కూడా టమాట ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. తెలంగాణా రాష్ట్రంలోనూ టమాటా ధరలు చుక్కలను చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వరదల కారణంగా తెలంగాణలో టమోటా ధరపై ప్రతికూల ప్రభావం పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని టమాటాలకు ఫేమస్ అయిన మదనపల్లి నుండి అత్యంత డిమాండ్ ఉన్న కూరగాయల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లోనూ ధరలు అకస్మాత్తుగా పెరిగాయి.