బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (11:16 IST)

భగ్గుమన్న ధరలు.. పెట్రోల్‌పై 34 పైసలు, డీజిల్‌పై 32 పైసలు

పెట్రోల్ ధరలు తగ్గట్లేదు. వరుసగా పదో రోజూ ఇంధన ధరలు భగ్గుమన్నాయి. గురువారం పెట్రోల్‌పై 34 పైసలు, డీజిల్‌పై 32 పైసల చొప్పున పెరిగాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.89.88 ఉండగా.. లీటరు డీజిల్ రూ. 80.27గా కొనసాగుతోంది. ముంబైలో పెట్రోల్ రూ.96.32కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ ఈ రోజు లీటరుకు రూ.91.11, చెన్నైలో రూ.91.98కు చేరింది. 
 
అలాగే హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.93.45, డీజిల్‌ రూ.87.55కు చేరింది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లో శ్రీగంగనగర్‌లో లీటర్‌కు రూ.100కిపైగా చేరింది. కొత్త సంవత్సరంలో ఇప్పటి వరకు 12 సార్లు చమురు ధరలు పెరిగాయి. వీటితో పాటు ఇటీవల వంట గ్యాస్ ధరలు కూడా పెరగడం సామాన్యుడి నెత్తిమీద భారం పడినట్లు అయింది. ధరలు అదుపులేకుండా ఇలా పెరుగుతుండటంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. 
 
ధరల పెంపుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కరోనాతో ఉపాధి కోల్పోయిన ప్రజలకు.. పెరిగిన ధరలు భారంగా మారాయని పేర్కొన్నాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ఈ బాదుడుకు కారణం గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని కేంద్రం పేర్కొనడం గమనార్హం.