శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (14:58 IST)

ఎన్నికల ఎఫెక్టు : అసోం సంచలన నిర్ణయం.. పెట్రోల్ ధరల తగ్గింపు

అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ ఆదేశాలు జారీచేసింది. గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశానికి ఎగబాకుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100ను దాటిపోయింది. 
 
ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వంటి వారు పెట్రోల్ డీజిల్‌ను కొనాలంటే బ్యాంకు రుణం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నారు. ఈ తరుణంలో అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌ఫై లీటరుకు ఏకంగా రూ.5 తగ్గిస్తూ అక్కడ బీజేపీ సర్కార్ వాహనదారులకు భారీ ఊరటనిచ్చింది. 
 
మరోవైపు మద్యం ప్రియులకు కూడా శుభవార్త చెప్పింది. మద్యంపై సుంకాన్ని 25 శాతం తగ్గించినట్లు అసోం ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. సవరించిన ఈ రేట్లు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి హిమంత బిస్వాస్ అసోం అసెంబ్లీలో ప్రకటించించారు. పెట్రోల్ ధర లీటరుకు ఐదు రూపాయలు తగ్గడంతో లక్షలాది మంది వాహన వినియోగదారులకు లాభం చేకూరుతుందన్నారు. 
 
కోవిడ్ 19 విస్తరణ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, మద్యంపై అదనపు సెస్‌ను విధించాం, అయితే ఇప్పుడు కరోనా రోజుల సంఖ్య బాగా తగ్గింది కనుక తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే అసోంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన ధరలు తగ్గించడం విశేషం.