గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (15:51 IST)

వచ్చే యేడాది నుంచి భారీగా తగ్గనున్న వేతనం!?

దేశంలో వచ్చే యేడాది నుంచి కొత్త వేతన చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే కార్మికుల వేతనాల్లో కోతపడనుంది. అంటే.. చేతికి వచ్చే వేతనం తగ్గొచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, పదవీ విరమణ తర్వాత ఎక్కువ ప్రయోజనాలు సమకూరుతాయంటున్నారు. 
 
అసలు కొత్త వేతన నిబంధనల ప్రకారం వేతనం ఎలా తగ్గుతుందో పరిశీలిద్ధాం. కొత్త వేత‌న నిబంధ‌న‌ల ప్ర‌కారం కంపెనీలు త‌మ పే ప్యాకేజీల్లో విధిగా మార్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ ప్రకారంగా మొత్తం జీతంలో అల‌వెన్సులు 50 శాతానికి మించ‌కూడ‌దు. అంటే మూలాధన వేతనం ఖచ్చితంగా మొత్తం జీతంలో 50 శాతం ఉండాల్సిందే. ఆ లెక్క‌న ఉద్యోగుల బేసిక్ పేలు పెరుగుతాయి. 
 
అందుకు త‌గిన‌ట్లుగానే గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ కూడా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్ర‌తి నెలా చేతికి అందే జీతం త‌గ్గుతుంది. ప్ర‌స్తుతం చాలా కంపెనీలు 50 శాతానికిపైగా అల‌వెన్సులు చెల్లిస్తున్నాయి. కొత్త వేత‌న నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌స్తే ఈ ప‌రిస్థితి ఉండ‌దు. 
 
ఈ కొత్త నిబంధ‌న‌లు ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగుల‌పై ఎక్కువ ప్ర‌భావం చూప‌నున్నాయి. సాధార‌ణంగా ప్రైవేట్ సెక్టార్‌లోనే ఉద్యోగులు ఎక్కువ అలవెన్స్‌లు అందుకుంటారు. అయితే వీటి వ‌ల్ల చేతికి అందే జీతం త‌గ్గినా.. రిటైర్మెంట్ ప్ర‌యోజ‌నాలు మెరుగ‌వుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త వేతన వచ్చే యేడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది.