ఐఎఫ్ఎస్ తుది ఫలితాల్లో తెలుగు బిడ్డలు సత్తా!!
ప్రతిష్టాత్మక ఫారెస్ట్ సర్వీస్ తుది ఫలితాలు వెల్లడయ్యాయి. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఫలితాలను తాజాగా రిలీజ్ చేయగా, వీటిలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశ వ్యాప్తంగా 143 మంది ఈ సర్వీసుకు ఎంపిక కాగా, వీరిలో పది మందికిపైగా తెలుగు విద్యార్థులు ఉండటం గమనార్హం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చాడ నిఖిల్ రెడ్డి జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించి, తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ర్యాంకర్గా నిలిచారు.
ఉత్తమ ర్యాంకులు సాధించిన వారిలో చాడ నిఖిల్ రెడ్డి (11వ ర్యాంకు)తో పాటు యెదుగూరి ఐశ్వరరెడ్డి 13వ ర్యాంకు, జి. ప్రశాంత్ 25వ ర్యాంకు, చెరుకు అవినాశ్ రెడ్డి 40వ ర్యాంకు, చింతకాయల లవకుమార్ 49వ ర్యాంకు సాధించారు. వీరితో పాటు అట్ల తరుణ్ తేజ (53), ఆలపాటి గోపినాథ్ (55), కె. ఉదయకుమార్ (77), టీఎస్ శిశిర (87) మంచి ర్యాంకులు సాధించారు.
మిర్యాలగూడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు చాడ శ్రీనివాస్ రెడ్డి, సునంద దంపతుల కుమారుడైన నిఖిల్ రెడ్డి, ఢిల్లీ ఐఐటీలో 2018లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం కొంతకాలం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసి, సివిల్ సర్వీసెస్ లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలేసి పరీక్షలకు సిద్ధమయ్యారు.
తనకు 11వ ర్యాంకు రావడంపై నిఖిల్ రెడ్డి స్పందిస్తూ, తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, ఐఏఎస్ సాధించాలన్నదే తన అంతిమ లక్ష్యమని, దానిని నెరవేర్చుకుంటానని ఆయన పేర్కొన్నారు.