గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (22:10 IST)

గీతంతో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ అవగాహన

Githam
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంతో రాజమండ్రి లోని ఐసిఎస్ఈ అనుబంధ పాఠశాల ఫ్యూచర్ కిడ్స్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఉప కులపతి ప్రొఫెసర్ దయానంద సిద్దవట్టం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఫ్యూచర్ కిడ్స్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించటం, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వారిని సన్నద్ధం చేయటం లక్ష్యంగా ఈ అవగాహన కుదిరిందన్నారు. తన సమక్షంలో జరిగిన ఈ అవగాహనా ఒప్పందంపై గీతం రిజిస్ట్రార్ డి. గుణశేఖరన్, ఫ్యూచర్ కిడ్స్ పాఠశాల ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏలేటి రుద్రశ్రీ మహాస్వి సంతకాలు చేసినట్టు తెలియజేశారు. 
 
క్లిష్టమైన ఆలోచనా నైపుణ్యాలకు ఫ్యూచర్ కిడ్స్ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దటంలో పేరు గాంచిందన్నారు. గీతంతో ఈ సహకారం, విద్యార్థులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు సాఫీగా మారేలా చేస్తుందని తెలిపారు. ఫ్యూచర్ కిడ్స్ లోని త్రిభాషా పద్దతికి, గీతం ఆంగ్ల మాధ్యమ బోధనా తోడై, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తుందని విసి అభిలషించారు.
 
ఫ్యూచర్ కిడ్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు గీతం వర్సిటీ లోని పలు కోర్సులు, విభాగాలలో అందిస్తున్న ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. రెండు సంస్థల అనువర్తిత అభ్యాసం గీతంకి మారే విద్యార్దులకు విద్యా ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని, అభ్యాస శైలులలో గణనీయమైన సర్దుబాట్ల అవసరాన్ని తొలగిస్తుందని డాక్టర్ దయానంద తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గీతం విశాఖపట్నం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ గౌతమ్ రావు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నిర్మల రావు తదితరులు పాల్గొన్నారు.