24 నుంచి జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి
దేశ వ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ నుంచి జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మొత్తం 290 నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. అలాగే, ఇతర దేశాల్లోని 18 నగరాల్లో వీటిని నిర్వహించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య పేపర్ 2 పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా లక్షన్నర మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లోని బీటెక్ ప్రవేశాల కోసం ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 24, 25, 29, 30, 31వ తేదీల్లో పేపర్ 1 పరీక్షను నిర్వహిస్తారు. అలాగే, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 28వ తేదీ పేపర్-2 పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షను మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్వహిస్తారు. కాగా, ఈ నెల 24వ తేదీన పరీక్ష రాసే వారు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇకపోతే, ఏప్రిల్ 8వ తేదీ నుంచి మొదలయ్యే మెయిన్ చివరి విడత పరీక్ష కోసం వచ్చే నెల 7 నుంచి మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించాల్సివుంటుంది. రెండు విడుతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకును కేటాయిస్తారు. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 11 లక్షల మంది హాజరుకానుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా లక్షన్నర మంది పరీక్ష రాయనున్నారు. అలాగే, ఈ దఫా తెలుగుతో పాటు ఏకంగా 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ కనబరిచిన వారిలో 2.50 లక్షల మంది మాత్రమే జూన్ 4వతేదీన నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు.