గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (15:06 IST)

నీట్ ఫలితాలు విడుదల.. అమ్మాయిల్లో తెలంగాణ బిడ్డ టాపర్..

నీట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థిని అమ్మాయిల్లో టాపర్‌గా నిలిచి సత్తా చాటింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (యూజీ)-2019 పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) బుధవారం (జూన్ 5) విడుదల చేసింది. ఈ మేరకు ఫలితాలను తమ అధికారిక వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో వుంచారు. 
 
ఈ ఫలితాల్లో తెలంగాణకు చెందిన మాధురీ రెడ్డి (695 మార్కులు) జాతీయ స్థాయిలో 7వ ర్యాంకుతోపాటు.. అమ్మాయిల్లో టాపర్‌గా నిలిచింది. అదేవిధంగా టాప్-100లో మొత్తం 20 మంది అమ్మాయిలు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. 
 
అలాగే నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో రాజస్థాన్‌కు చెందిన ఖందేల్వాల్ 720 మార్కులకు గాను 701 మార్కులతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక రెండో ర్యాంకులో ఢిల్లీకి చెందిన భావిక్ బన్సాల్, మూడో ర్యాంకులో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అక్షత్ కౌశిక్ నిలిచారు.
 
మే 5న దేశవ్యాప్తంగా 154 పరీక్ష కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 11 భాషల్లో పరీక్ష నిర్వహించింది. ఈ ఏడాది నీట్(యూజీ) పరీక్షకు దేశవ్యాప్తంగా 15,19,375 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా.. 14,10,754 మంది హాజరయ్యారు.