మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (11:43 IST)

మాండలిన్ శ్రీనివాస్ ఇక లేరు.. ఆపరేషన్ ఫెయిల్ కావడంతో..

మాండలిన్ జీనియస్ ఉప్పాలపు శ్రీనివాస్ అలియాస్ మాండలిన్ శ్రీనివాస్ శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. ఆయన గతకొంత కాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ ఫెయిల్ అవడంతో మాండలిన్ శ్రీనివాస్ ఆకస్మికంగా మృతి చెందారు. మాండలిన్ శ్రీనివాస్ మరణంతో చెన్నైలోని కళారంగం మూగబోయింది. ఈయన వయస్సు 45 యేళ్లు. 
 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పాలకొల్లులో 1969 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జన్మించారు. ఈయన ఆరేళ్ల ప్రాయం నుంచే మాండలిన్‌‌ వాయిద్యంపై ఉన్న ఆసక్తిని గమనించి తండ్రి సత్యనారాయణ పలువురు గురువుల వద్ద శిక్షణ ఇప్పించారు. ఈయనకు అతి చిన్న వయస్సులోనే పద్మ పురస్కారం దక్కింది. ఈయన వయస్సు 29 యేళ్ళుగా ఉన్న సమయంలో అంటే 1998లో పద్మ శ్రీ అవార్డును కేంద్రం ప్రదానం చేసింది. 2010లో సంగీత నాటక అకాడెమీ అవార్డును అందుకున్నారు. ఈయన తొలి మాండలిన్ కచ్చేరి ఆంధ్రప్రదేశ్‌, గుడివాడలో జరిగిన త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాల్లో జరిగింది.