1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (09:56 IST)

మహానటుడు శివాజీ గణేశన్ కుమారులపై మోసం కేసు

Prabhu
తమిళ చిత్రపరిశ్రమలో మహానటుడుగా గుర్తింపు పొందిన దివంగత శివాజీ గణేశన్‌ కుమారులైన హీరో ప్రభు, నటుడు రామ్ కుమారులపై మోసం కేసు నమోదైంది. ఈ కేసును వారి చెల్లెళ్లు అయిన శాంతి, రాజ్వీలు చేశారు. ఈ మేరకు వారు హైకోర్టును ఆశ్రయించారు. తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా ఇవ్వకుండా మోసం చేశారంటూ వారు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
దివంగత ప్రముఖ నటుడు శివాజీ గణేశ్‌ కుమారులు ప్రభు, రామ్‌కుమార్‌, కుమార్తెలు శాంతి, రాజ్వీ ఉన్నారు. శివాజీ గణేశన్ మరణం తర్వాత రూ.270 కోట్ల ఆస్తులను సక్రమంగా నిర్వహించలేదని, తమకు వాటాలు ఇవ్వకుండా మోసం చేశారని శాంతి, రాజ్వీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
 
తమకు తెలియకుండా ఆస్తులను విక్రయించారని, ఆ ప్రక్రియ చెల్లదని ప్రకటించాలన్నారు. వెయ్యి సవర్ల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను ప్రభు, రామ్‌కుమార్ అపరిహరించారని, శాంతి థియేటర్‌లో ఉన్న రూ.82 కోట్ల విలువైన వాటాలను వారిద్దరి పేరిటకు మార్చుకున్నట్లు ఆరోపించారు. 
 
శివాజీ గణేశన్ రాసినట్లు చెబుతున్న వీలునామా నకిలీదని, జనరల్‌ పవర్ ఆఫ్‌ అటార్నీపై సంతకం తీసుకుని తమను మోసం చేశారని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రభు, రామ్‌కుమార్‌లతో పాటు వారి కుమారులు విక్రమ్‌ ప్రభు, దుశ్యంత్‌లను కూడా ప్రతివాదులుగా చేర్చారు. ప్రభు, రామ్ కుమారులు మోసం చేశారంటూ వారి చెల్లెళ్లు కోర్టును ఆశ్రయించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.