మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (17:34 IST)

పచ్చిమిరపకాయలను వేడి నీటిలో కాసేపు ఉంచి...?

ఇంట్లోనే తయారు చేసుకునే ఎండుమిరపకాయల పొడి.. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. నిల్వ ఉంచే డబ్బాలో ఓ చిన్న ఇంగువ ముక్కను వేస్తే చాలు. ఉల్లిపాయల పేస్ట్ ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే... ఉల్లిపాయలను గ్రైండ్ చేసే ముందు కొద్దిగా నూనె వేసి వేయిస్తే.. పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పాలకోవా తయారుచేసేటప్పుడు పాలతో ముందుగానే చక్కెర కలుపకూడదు. పాలు బాగా మరిగిన తరువాత చివరలో తక్కువ పంచదారను కలిపితే పాలకోవా ఎక్కువ రుచిగా ఉంటుంది.
 
వెల్లుల్లిపాయలను కొద్దిగా చిదిమి గాజు సీసాలో వేసి అందులో ఒక కప్పు నూనె పోసి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచాలి. ఒకటి రెండు వెల్లుల్లి రేకులు అవసరమైనప్పుడు పనిగట్టుకుని నూరకుండా ఈ నూనె ఒక చెమ్చా ఉపయోగిస్తే సరిపోతుంది. వంటకానికి మంచి రుచి, వాసన వస్తుంది. పుదీనా ఆకులను డైనింగ్ టేబుల్‌పై ఉంచినట్టయితే.. దాని నుండి వచ్చే వాసనకు ఈగలు, దోమలు దగ్గరకు రావు.
 
బంగాళాదుంపలను ఒక వారం రోజులపాటు నిల్వ ఉంచితే వాటికి మొలకలు వచ్చేస్తాయి. అలా మొలకలు రాకుండా ఉండాలంటే.. బంగాళాదుంపలతో పాటు ఒక ఆపిల్‌ను కూడా ఉంచాలి. పుట్టగొడుగులపై ఉన్న మట్టి ఓ పట్టాన వదలదన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఏదైనా పిండి తీసుకుని పుట్టుగొడుగులపై చల్లి ఆ తరువాత వాటిపై నీటిని పోస్తూ గట్టిగా రుద్దితే మట్టి పూర్తిగా పోయి శుభ్రంగా తయారవుతాయి. 
 
పచ్చిమిరపకాయలను వేడి నీటిలో కాసేపు ఉంచి.. ఆ తరువాత ఎండలో ఎండబెట్టినట్టయితే.. కాయల రంగు మారినా కారం బాగా తగ్గిపోతుంది. బ్రెల్ నిల్వ వాసన వస్తుంటే.. బ్రెడ్ పీసుల్లో నీరు పోసి అల్యూమినియం ఫాయిల్లో చుట్టి 10 నిమిషాలు ఓవెన్లో వేడిచేస్తే తాజాగా ఉండడంతో పాటు వాసన మటమాయమవుతుంది. ఆపిల్ ముక్కలను 10 నిమిషాల పాటు ఉప్పు నీటిలో ఉంచి తీస్తే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి.