హైదరాబాద్ నగరంలో 14 నెలల చిన్నారికి జేఎన్ 1 కరోనా...
హైదరాబాద్ నగరంలో 14 నెలల చిన్నారికి జేఎన్ 1 కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ చిన్నారికి ఆక్సిజన్ సాయంతో వైద్యం అందిస్తున్నారు. నాంపల్లిలోని ఆగాపుర ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి తీవ్రజ్వరంతో పాటు శ్వాస పీల్చడంతో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఐదు రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలికను పరీక్షించిన వైద్యులు... ఆ చిన్నారి నుంచి శాంపిల్ సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇందులో కరోనా వైరస్ సోకినట్టు తేలింది.
దీంతో ఆ చిన్నారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడానే ఉందని, క్రమంగా కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. కాగా, ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో చిన్నారి పరిస్థితి దృష్ట్యా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించడం జరిగిందనీ, ప్రస్తుతం దానిని తొలగించి ఆక్సిజన్ అందిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం దానిని తొలగించి ఆక్సిజన్ అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
మరోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నాటికి కేసుల సంఖ్య 20కి చేరింది. వీరిలో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ కాగా, మిగతా 19 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. గురువారం వెలుగు చూసిన కొత్త కేసుల్లో నాలుగు హైదరాబాద్‌లో నమోదు కాగా, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదైందని అధికారులు వెల్లడించారు.