1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (19:02 IST)

ఆంధ్రాలో దడపుట్టిస్తున్న కరోనా.. ఒక్కసారిగా పెరిగిన మరణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దడపుట్టిస్తోంది. ఒక్కసారిగా కరోనా మరణాలు పెరిగిపోయాయి. రోజురోజుకు కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. కొత్తగా రాష్ట్రంలో 31,892 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 2,765 మందికి కరోనా సోకినట్లు తేలింది. తాజాగా కరోనా కారణంగా 11 మంది ప్రాణాలు విడిచారు. 
 
కరోనా వైరస్ కారణంగా అనంతపూరంలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కొత్తగా 1245 మంది కరోనా జయించినట్లు ప్రభుత్వం శుక్రవారం రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. నేటివరకు రాష్ట్రంలో 1,53,65,743 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16422 యాక్టివ్ కేసులున్నాయి.
 
మరోవైపు, రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. వైరస్‌ను లైట్ తీసుకోవద్దని, అది మరోసారి విజృంభిస్తే ప్రమాదకర పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
 
ఇదిలావుంటే దేశంలో కూడా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజల్ని హడలెత్తిస్తోంది. కొత్తగా దేశంలో 1,31,918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వైరస్ కారణంగా 802 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 9.74 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.