ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌కు త్వరలో ఆమోదముద్ర : డోనాల్డ్ ట్రంప్

trump
ఠాగూర్| Last Updated: మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (22:05 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ విరుగుడుకు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ తలమునకలైవున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్ వంటి దేశాలు కరోనాకు వ్యాక్సిన్‌ను కనిపెట్టే పరిశోధనల్లో నిమగ్నమైవున్నాయి.

ఈ పరిశోధనల్లో అమెరికా ఇతర దేశాలకంటే ఒక అడుగు ముందులో ఉంది. దీనికి కారణం ఆ దేశంలో కరోనా విలయతాండవం కొనసాగడమే. ఇత‌ర దేశాల‌తో పోల్చితే ఇప్పటికే అత్యధిక కేసులు, మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉంది.

దీంతో సాధ్యమైనంత త్వరగా క‌రోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తీసుకొచ్చి, దేశ ప్రజలను రక్షించాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే దేశంలోని పలు కంపెనీలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న‌ది. ఆ దేశంలో ఇప్పటికే పలు టీకాలు ఆఖరి దశ ట్రయల్స్‌లో ఉన్నాయి.

తాజాగా ఆస్ట్రాజెనికా అనే క‌రోనా వ్యాక్సిన్ ట్రయల్స్ మూడో దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఆ వ్యాక్సిన్‌కు తుది ఆమోదం లభిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఇప్పటికే దేశంలో ఆఖరి దశకు చేరిన వ్యాక్సిన్ల సరసన ఆస్ట్రాజెనికా కూడా చేరిందన్నారు. 2021 జనవరి కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, సుమారు 300 మిలియన్ల డోసుల తయారీకి ఒప్పందం కుదిరిందని చెప్పారు.

అసాధ్యం అనుకున్న పనిని అగ్రరాజ్యం సాధ్యం చేసి చూపిస్తున్న‌ద‌ని, పరిశోధకుల పనితీరు భేష్ అని అధ్య‌క్షుడు ట్రంప్‌ ప్రశంసించారు. కాగా, అమెరికాలో విరుచుకుపడుతున్న మహమ్మారి ఇప్పటికే 1.87 లక్షల మందిని పొట్టనపెట్టుకున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు 62 లక్షల మందికిపైగా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు.దీనిపై మరింత చదవండి :