శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (11:05 IST)

ఆర్థర్ రోడ్డు జైలులో ఖైదీలకు కరోనా ... ఉలిక్కిపడిన జైలు అధికారులు

మహారాష్ట్రలో కలకలం రేగింది. ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులోని ఖైదీలకు కరోనా వైరస్ సోకింది. దీంతో జైలు అధికారులు ఉలిక్కిపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వార్తల మేరకు మొత్తం 103 మంది ఖైదీలకు ఈ వైరస్ సోకింది. వీరిలో 77 మంది అండర్ ట్రయల్ ఖైదీలు ఉండగా, మిగిలిన వారంతా జైలు సిబ్బందే. 
 
కరోనా పాజిటివ్ అయిన ఖైదీలతో పాటు సిబ్బందిని పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే గురువారం బాధితులందరినీ ముంబైలోని సెయింట్ జార్జ్, గోకుల్ తేజ్ ఆసుపత్రులకు తరలించారు. డ్రగ్ స్మగ్లింగ్ కేసులో ఇటీవల ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. అతడికి కరోనా వైరస్ సోకి ఉంటుందని, అతడి నుంచి మిగతా వారికి అది సంక్రమించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. 
 
800 మంది మాత్రమే ఉండాల్సిన ఆర్థర్ రోడ్డు జైలులో ప్రస్తుతం 2600 మంది ఖైదీలు ఉండటంతో కిక్కిరిసిపోయింది. దీంతో కొత్త ఖైదీలను తీసుకునేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. జైళ్లలో వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో చిన్న నేరాలతో జైలుకు వచ్చిన 11 వేల మందిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు.
 
మరోవైపు, గత 24 గంటల్లో కొత్తగా 3390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 56342కు చేరాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 16,539 మంది కోలుకోగా, ఒకరు విదేశాలకు వెళ్లిపోయారు. 
 
ఆసుపత్రుల్లో 37,916  మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో మాత్రం రికార్డు స్థాయిలో 17,974 కేసులు నమోదు కాగా, గుజరాత్‌లో 7,012, ఢిల్లీలో 5,980, తమిళనాడులో 5,409, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1717 కేసులు నమోదయ్యాయి.