శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జులై 2020 (18:30 IST)

వ్యాక్సిన్ కోసం కరోనాను పుట్టించారా? బిల్‌గేట్స్ వివరణ.. ఇంకా కమ్మని కబురు

Bill Gates
కరోనా మహమ్మారికి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ల కోసం భారీగా కసరత్తు పడుతున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు తమ వ్యాక్సిన్ సిద్ధమైందని.. క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కరోనా వ్యాక్సిన్ విషయంలో ఓ కమ్మని కబురు చెప్పారు. వచ్చే ఏడాది జూన్ నాటికల్లా దక్షిణ కొరియాలోని ఫార్మా కంపెనీలో 20 కోట్ల కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి జరుగుతుందని బిల్‌గేట్స్ వెల్లడించారు.
 
ఈ మేరకు గేట్స్.. సౌత్ కొరియా దేశాధ్యక్షుడు మూన్ జే ఇన్‌కు ఓ లేఖ రాశానని చెప్పారు. ఎస్‌కే బయోసైన్స్ అనే ఫార్మా కంపెనీలో ఈ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తామని గేట్స్ తెలిపారు. బిల్‌ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి 3.6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందింది అని ఈ ఏడాది మే నెలలో సదరు ఫార్మా కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల కోసమే ఇచ్చినట్లు సమాచారం.
 
మరోవైపు క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారికి తానే కార‌ణ‌మంటూ వ‌స్తున్న కుట్ర‌పూరిత వ‌దంతుల‌పై బిల్ గేట్స్ స్పందించారు. ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆయ‌న ఖండించారు. సులువైన కార‌ణాలు వెతుకుతున్న ప్ర‌జ‌లు.. సోష‌ల్ మీడియాను ఆధారం చేసుకుని.. క‌రోనా మ‌హ‌మ్మారిపై క‌థ‌నాలు క్రియేట్ చేస్తున్నార‌ని బిల్ గేట్స్ అభిప్రాయ‌ప‌డ్డారు. 
 
మార్ఫింగ్ చేసిన ఫోటోలు, న‌కిలీ వార్త‌ల‌ను.. మ‌హ‌మ్మారి మొద‌లైన క్ష‌ణం నుంచి గేట్స్‌ను టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్ర‌జ‌ల జీవితాల‌ను ర‌క్షించేందుకు త‌మ ఫౌండేష‌న్.. వ్యాక్సిన్ సంస్థ‌ల‌కు అధిక మొత్తంలో నిధుల‌ను అందించిన‌ట్లు గేట్స్ తెలిపారు. డబ్బ‌ులు సంపాదిస్తున్నాం కాబ‌ట్టి, వ్యాక్సిన్లు త‌యారు చేసి.. మేమే ప్ర‌జ‌ల్ని చంపుతున్నామ‌ని మీరంటున్నారా అంటూ గేట్స్ ఆరోపించారు.
 
క‌రోనా సంక్షోభం మొద‌లైన నాటి నుంచి బిల్ గేట్స్‌ పై ఆరోప‌ణ‌లు కొన‌సాగుతున్నాయి. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాల్లో.. వివిధ భాష‌ల్లోనూ అనేక క‌థ‌నాలు ప్ర‌చురితం అయ్యాయి. వ్యాక్సిన్ త‌యారీ కోసం వైర‌స్‌ను గేట్స్ పుట్టించిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేశారు. 
 
బ‌యోలాజిక‌ల్ టెర్ర‌రిజం కేసులో గేట్స్‌ను ఎఫ్‌బీఐ అరెస్టు చేసిన‌ట్లు కూడా కొన్ని పోస్టులు సోష‌ల్ మీడియాలో క‌నిపించాయి. వ్యాక్సిన్ త‌యారీ నుంచి డ‌బ్బు సంపాదించేందుకు గేట్స్ వైర‌స్‌ను సృష్టించిన‌ట్లు కొంద‌రు ఆరోపించారు. 2015లోనూ బ్రెజిల్‌లో జికా వైర‌స్ ప్ర‌బ‌లిన‌ప్పుడు.. గేట్స్‌పై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.