శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (18:57 IST)

ఏపీలో ఇప్పటివరకు 6.32 లక్షల పాజిటివ్ కేసులు - 5.4 వేల మరణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో మరో 10555 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య ఏకంగా 639302కు చేరింది. అయితే, ఇప్పటివరకు 5,62,376 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 71,465 మంది చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు, 51 మంది కరోనాతో మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 8 మంది, అనంతపురం జిల్లాలో ఆరుగురు, విశాఖ జిల్లాలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 5,461కి పెరిగింది. కొన్నివారాల కిందట భారీగా పాజిటివ్ కేసులు వెల్లడి కావడం, అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించడంతో ఏపీలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. 
 
మరోవైపు, తెలంగాణ‌లో క‌రోనా కేసుల ఉద్ధృతి కొన‌సాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,166 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,143 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,74,774 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,44,073 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,052కు చేరింది. ప్రస్తుతం 29,649 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 309, రంగారెడ్డి జిల్లాలో 166 కేసులు నమోదయ్యాయి.
 
ఇకపోతే, దేశంలో కరోనా దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో దేశంలో 75,083 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 55,62,664కు చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 1,053 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 88,935కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 44,97,868 మంది కోలుకున్నారు. 9,75,861 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,53,25,779 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. సోమవారం ఒక్కరోజులోనే 9,33,185 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.