ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2023 (12:42 IST)

దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు - 24 గంటల్లో 358 కేసులు

coronavirus
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా వ్యాపిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 358 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి పెరిగింది. కేరళలో కొవిడ్ వేరియంట్ జేఎన్.1 కేసులు గుర్తించిన నేపథ్యంలో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా తాజాగా ముగ్గురు మరణించారు. ఈ మూడు మరణాలు కేరళలోనే నమోదయ్యాయి. తాజా మరణాలతో కలుపుకొని దేశవ్యాప్తంగా కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 5,33,327కు పెరిగింది.
 
తాజా కేసులు కేరళ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఆ శాఖ వెబ్‌సైట్ గణాంకాల మేరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,44,70,576కు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఇక, కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు దేశంలో 21 నమోదయ్యాయి. కరోనా మళ్లీ కొత్త రూపంలో బుసలు కొడుతుండడంతో రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడికి చర్యలు ప్రారంభించాయి. చాలా రాష్ట్రాలు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. 
 
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత 24 గంటల్లో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ హైదరాబాద్ నగరంలోనే నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం 14 మంది కోవిడ్ చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో కూడా కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్టు సమాచారం. కోవిడ్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.