సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (20:15 IST)

కొత్త టెలీ కమ్యూనికేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

new Parliament
పార్లమెంట్‌‍లో కొత్త టెలీ కమ్యూనికేషన్ బిల్లు 2023కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే, ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ 1885, వైర్‌లెస్‌ టెలీగ్రఫీ యాక్ట్‌ 1993, ది టెలీగ్రఫీ వైర్స్‌ యాక్ట్‌ 1950 స్థానంలో కొత్త బిల్లును తీసుకొచ్చారు. లోక్‌సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాజ్యసభకు పంపనున్నారు. అక్కడా ఆమోదం లభిస్తే.. రాష్ట్రపతి సంతకంతో చట్ట రూపం దాల్చనుంది.
 
కొత్త టెలికాం చట్టం ప్రకారం శాంతి భద్రతలకు, దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే పరిస్థితులు ఎదురయ్యాయని భావించినప్పుడు.. టెలికాం నెట్‌వర్క్‌ మొత్తాన్ని ప్రభుత్వం తన నియంత్రణలోకి, నిర్వహణలోకి తీసుకోవచ్చు. ప్రజాప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం సందేశాలను రహస్యంగా వినొచ్చు. ప్రసారాలను నిలిపివేయవచ్చు. ప్రకృతి విపత్తుల వంటి సమయాల్లోనూ ప్రభుత్వానికి ఇటువంటి అధికారాలు లభిస్తాయి.
 
ఎవరైనా అనధికార టెలికాం నెట్‌వర్క్‌ను, పరికరాలను, రేడియోలను వినియోగిస్తున్నారని తెలిస్తే.. ప్రభుత్వం లేదా ప్రభుత్వ నియమిత వ్యక్తి ఏ భవనాన్ని అయినా, విమానం, నౌకలు సహా ఎటువంటి వాహనాన్ని అయినా తనిఖీ చేయవచ్చు. స్వాధీనం చేసుకోవచ్చు. వాణిజ్య అవసరాలకు స్పెక్ట్రమ్‌లను వేలం ద్వారానే కేటాయించాలన్న దేశీయ టెలికాం సేవల సంస్థలైన జియో, వొడాఫోన్‌ ఐడియా అభ్యర్థనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. 
 
ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ సేవలందించే కంపెనీలకు పాలనా అనుమతుల ద్వారానే స్పెక్ట్రమ్‌లను కేటాయించేలా బిల్లులో ప్రతిపాదించింది. ఇంటర్నెట్‌ ఆధారిత సందేశాలకు, కాల్స్‌ చేసుకోవడానికి వీలు కల్పించే వాట్సప్‌, టెలిగ్రామ్‌, గూగుల్‌ మీట్‌ వంటి యాప్‌లకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) చట్ట నిబంధనలు వర్తించనున్నాయి. వీటిని టెలికాం చట్ట పరిధి నుంచి తొలగించనున్నారు. ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌) యాప్‌లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) పరిధిలో ఉండబోవని అధికార వర్గాలు తెలిపాయి.
 
అక్రమంగా, అనుమతుల్లేకుండా ఫోన్‌ సందేశాలను రహస్యంగా విన్నా, ట్యాపింగ్‌కు పాల్పడినా భారీ జరిమానాతో పాటు కఠిన శిక్ష విధించే నిబంధనలను ఈ బిల్లులో చేర్చారు. దేశ ప్రయోజనాలకు, మిత్ర దేశాలతో ఉన్న సత్సంబంధాలకు భంగం కలిగించేలా టెలికం సేవలను దుర్వినియోగపరిచినా నేరంగా పరిగణిస్తారు. దోషులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.2 కోట్ల వరకు జరిమానా, నేర తీవ్రతను బట్టి ఈ రెండూ విధించే అవకాశం ఉంది