శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2023 (10:43 IST)

నెలసరి రోజుల్లో మహిళలకు సెలవు అక్కర్లేదు : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

smriti irani
మహిళలకు నెలసరి రోజుల్లో సెలవు అక్కర్లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఓ మహిళగా తన దృష్టిలో నెలసరి అంటే ఓ సహజ ప్రక్రియ అని, అది వైకల్యం కాదని చెప్పారు. అందువల్ల ఆ రోజున సెలవు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, నెలసరి రోజుల్లో మహిళలకు సెలవులపై రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆమె పై విధంగా సమాధానమిచ్చారు. 
 
'నెలసరి అనేది ఓ సహజ ప్రక్రియ.. అదేమీ వైకల్యం కాదని ఓ మహిళగా నేను చెప్పదలుచుకున్నాను'. మహిళ జీవన ప్రయాణంలో అదొక భాగం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సమానావకాశాలకు మహిళలను దూరం చేసే ప్రతిపాదనలు చేయకూడదు' అని మరో ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.
 
నెలసరి సహజ ప్రక్రియ అని, కొందరు మహిళలకు ఆ సమయంలో శారీరక బాధలు ఉన్నా మందులతో ఉపశమనం పొందవచ్చన్నారు. అయితే, ఈ అంశంపై సమాజం ఇప్పటికీ మౌనంగానే ఉంటోందని, ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాజంలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
 
మహిళా ఉద్యోగులకు నెలసరిలో జీతంతో కూడిన సెలవులు మంజూరు తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదన ఏదైనా ఉందా అని ఎంపీ శశిథరూర్ గతవారం లోక్‌సభలో ప్రశ్నించారు. అయితే, అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్మృతి పేర్కొన్నారు.