లోక్‌సభలో భద్రతా వైఫల్యం... సభలోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు
పార్లమెంట్ సమావేశాల వేళ లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో లోక్‌సభలో దుండగులు కలకలం సృష్టించారు. సందర్శకులు కూర్చునే గ్యాలరీ నుంచి ఓ వ్యక్తి సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ వద్ద ఒకరకమైన గ్యాస్‌ను వదిలి భయభ్రాంతులకు గురిచేశాడు. అదే సమయంలో పార్లమెంట్ భవనం వెలుపల మరో ఇద్దరు రంగుల పొగలు వదిలారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఈ నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు.
"లోక్‌సభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నాం. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతాం. ఆ పూర్తి బాధ్యత నాదే. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
అయితే, నిందితులు వదిలిన గ్యాస్ ఏమిటనే దానిపై సమగ్ర విచారణ జరుపుతాం. దీనిపై ఈ సాయంత్రం సమావేశం నిర్వహిస్తాం. సభ్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటాం" అని వెల్లడించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే.. సభ సజావుగా నిర్వహించడం మనందరి బాధ్యత అని స్పీకర్ అన్నారు.