ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2023 (17:06 IST)

పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మన దేశంలో భాగమే.. అక్కడ 24 సీట్లు రిజర్వు : హోం మంత్రి అమిత్ షా

amit shah
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ కూడా మన దేశ భూభాగమే అని, అక్కడ కూడా 24 సీట్లు రిజర్వు చేసినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో భాగంగా బుధవారం జమ్మూకాశ్మీర్‌‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి అక్కడ అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. 
 
ఈ క్రమంలోనే ‘జమ్మూ-కశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు-2023’, ‘జమ్మూ-కశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) బిల్లు-2023’ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. వాటికి దిగువసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుల్లో పునర్విభజన తర్వాత శాసనసభ నియోజక వర్గాల సంఖ్య ఎలా ఉండనుంది? రిజర్వేషన్లు అమలు ఎలా? వంటి అంశాలను పొందుపర్చారు. వీటిపై లోక్‌సభలో రెండు రోజుల పాటు చర్చ చేపట్టారు. 
 
ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బిల్లులోని కీలక అంశాలను సభకు వెల్లడించారు. గతంలో జమ్మూకశ్మీర్‌లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 83 ఉండగా.. తాజా బిల్లులో దాన్ని 90కి పెంచాలని ప్రతిపాదించారు. ఇంతకుముందు కాశ్మీర్‌ డివిజన్‌లో 46, జమ్ము డివిజనులో 37 స్థానాలు ఉండేవి. తాజా బిల్లులో కాశ్మీర్‌ డివిజన్‌లో అసెంబ్లీ స్థానాలను 47, జమ్ము డివిజన్‌లో 43కు పెంచినట్లు అమిత్ షా వెల్లడించారు. 
 
ఇక పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ మన దేశంలో భాగమేనని ఆయన అన్నారు. అందుకే, అక్కడ కూడా 24 స్థానాలను రిజర్వ్‌ చేసినట్లు ప్రకటించారు. ఇక, కాశ్మీర్‌లో రెండు స్థానాలను కాశ్మీర్‌ నుంచి వలసవెళ్లినవాళ్లు, ఒక స్థానాన్ని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ నుంచి వచ్చి స్థిరపడినవారికి రిజర్వ్‌ చేసినట్లు అమిత్ షా తెలిపారు. తొలిసారిగా ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీలకు 9 స్థానాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. 
 
70 ఏళ్లుగా అన్యాయానికి, అవమానాలకు గురైన వారికి న్యాయం చేసేందుకు ఈ బిల్లులను ప్రవేశపెడుతున్నాను. ఏ సమాజంలోనైనా వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావాలి. ఈ క్రమంలో వారి గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా చూడాలి. అదే భారత రాజ్యాంగం ప్రాథమిక ఉద్దేశం. ప్రస్తుతం చాలా మంది కాశ్మీరీలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకొంటున్నారు. ఈ బిల్లుతో వారికి హక్కులు, ఉద్యోగాలు, విద్యావకాశాలు, రిజర్వేషన్ల సాయంతో ఎన్నికల్లో నిలబడే అవకాశాలు వస్తాయి అని అమిత్‌షా వెల్లడించారు.