శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

బహిష్కరణ వేటుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా

Mahua Moitra
తనను లోక్‌సభ నుంచి బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు మహువా మొయిత్రా సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త నుంచి డబ్బులు తీసుకున్నారన్న నేరంపై లోక్‌సభ ఆమెపై ఈ నిర్ణయం తీసుకొంది. ఆమెపై వచ్చిన ఫిర్యాదులపై తొలుత ఎథిక్స్ కమిటీ దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించింది. ఈ ప్రశ్నలు అడిగేందుకు బహుమతులు తీసుకున్నారని, ఇతర సౌకర్యాలు పొందారని, అందువల్ల ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని సిఫార్సు చేస్తూ ఆ కమిటీ నివేదిక సమర్పించింది. 
 
ఈ కమిటీ నివేదిక ఆధారంగా చేసుకొని ఆమెను ఎంపీ పదవి నుంచి బహిష్కరిస్తూ ఈ నెల ఎనిమిదో తేదీన లోక్‌సభ ఓ తీర్మానం ఆమోదించింది. ఆమె చర్య అనైతికమని, సభాహక్కులను ధిక్కరించేదని పేర్కొంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రశ్నలు అడిగేందుకు లోక్‌సభ లాగిన్ పాస్‌వర్డ్‌ను ఇతరులకు ఇచ్చారని, ఇది దేశ భద్రతతో రాజీపడడమేనని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. 
 
ఈ నేపథ్యంలో తనపై విధించిన నిషేధాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను డబ్బులు తీసుకున్నట్టు ఎలాంటి రుజువులు చూపించలేదని, ఆధారాలు లేకుండానే బహిష్కరించారని అంతకుముందు ఆమె పేర్కొన్నారు. తాను లోక్‌సభ లాగిన్ పాస్‌వర్డ్‌ను మాత్రమే ఇతరులకు ఇచ్చానని చెప్పారు. తన బహిష్కరణకు దీన్ని కారణంగా చూపించారని తెలిపారు. అయితే పాస్‌వర్డ ఇతరులకు ఇవ్వకూడదంటూ ఎక్కడా నిబంధనలు లేవని చెప్పారు. అదానీ వ్యవహారాలపై ప్రశ్నించినందునే తనపై ఇలాంటి చర్య తీసుకున్నారని ఆమె ఆరోపించారు.