గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (15:31 IST)

కాశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు : సుప్రీంకోర్టు

article 370
జమ్మూకాశ్మీర్ ప్రాంతానికి ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అందువల్ల ఆ ప్రాంతానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేయడం సబబేనని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. జమ్మూకాశ్మీర్ ప్రాంతం భారత్‌లో విలీనమైనపుడు ప్రత్యేక సార్వభౌమత్వ లేదని వ్యాఖ్యానించింది. అప్పట్లో జమ్మూకాశ్మీర్‌లో ఉన్న పరిస్థితులు, యుద్ధ వాతావరణం కారణంగానే ఆర్టికల్ 370ని ఏర్పాటు చేశారని గుర్తుచేసింది. ఈ ఆర్టికల్ ఏర్పాటు తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చదివి వినిపించారు.
 
ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లపై సుధీర్ఘ విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని సీజేఐ తెలిపారు. ఈ ధర్మాసనంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, దీనిపై రాష్ట్రపతి ప్రకటన చేశారని ధర్మాసనం గుర్తుచేసింది. పార్లమెంట్ నిర్ణయాన్ని, రాష్ట్రపతి ప్రకటనను కొట్టిపారేయలేమని తేల్చి చెప్పింది.
 
దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు కాశ్మీర్ కూడా సమానమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మిగతా రాష్ట్రాలకు లేని ప్రత్యేక ప్రతిపత్తి కాశ్మీర్‌కు మాత్రమే ఉండదని, ఆర్టికల్ 370 నాటి పరిస్థితుల దృష్ట్యా చేసిన తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని పేర్కొంది. 2024 సెప్టెంబర్ 30 లోపు జమ్మూకాశ్మీర్, లడఖ్‌లలో ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది.