ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2023 (16:47 IST)

చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

chandrababu
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది. స్కిల్‌ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్‌పై గతంలో వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. శుక్రవారం జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మల ధర్మాసనం పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టింది.
 
స్కిల్‌ కేసుకు సంబంధించి 17ఏ వ్యవహారంపై ఇప్పటికీ తీర్పు వెలువరించలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 17ఏ వ్యవహారంపై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే కోరారు. వాయిదా వేయకుంటే విచారణ తేదీని చెప్పాలని ధర్మాసనాన్ని కోరారు. 
 
అయితే, నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్‌ దాఖలు చేయలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని హరీష్‌ సాల్వే తెలిపారు. అదేసమయంలో ఈ అంశం 17ఏ తీర్పుతో ముడిపడి ఉందని హరీష్‌ సాల్వే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సాల్వే వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. విచారణను జనవరి మూడో వారంలో చేపడతామని తెలిపింది. 
 
అయితే, తేదీ ఖరారు చేయాలని హరీశ్‌ సాల్వే ధర్మాసనాన్ని కోరారు. సాల్వే విజ్ఞప్తితో తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 19కి వాయిదా వేసింది. జనవరి 19లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదిని ఆదేశించింది. ఆ కౌంటర్‌కు రిజాయిండర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.