1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (11:21 IST)

తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న చంద్రబాబు

chandrababu naidu
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆయన తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి తిరుమలకు వచ్చి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠం కాంప్లెక్స్‌ వద్ద వారికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటుచేశారు. 
 
శ్రీవారి దర్శనం అనతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు. అలాగే, అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారే కాపాడారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 
 
తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తాను. ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్నాను. కష్టం వచ్చినప్పుడు స్వామివారిని మొక్కుకున్నాను. ధర్మాన్ని కాపాడాలని ప్రార్థించాను. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి. తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా ఉండాలి' అని కోరుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
 
ఇదిలావుంటే, శుక్రవారం అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కీలక సమావేశం జరుగనుంది. శ్రీవారి దర్శనం తర్వాత ఆయన నేరుగా అమరావతికి చేరుకుంటారు. సాయంత్రం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఈ నెల 4వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత చేకూరింది. 
 
ఇదిలావుంటే, ఈ నెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. శనివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. వాస్తవానికి ఈ సమావేశం 3వ తేదీన నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే, 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో సమావేశాన్ని ఒక రోజు ముందుకు జరిపారు.