శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: శనివారం, 3 ఏప్రియల్ 2021 (18:37 IST)

తెలంగాణలో పంజా విసురుతున్న కరోనా, విషమంగా 979 మంది ఆరోగ్యం, ఆఖరి నిమిషంలో వస్తున్నారు

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండోదశ కొవిడ్‌ రోజురోజుకూ పంజా విసురుతోంది. తొలిదశ కంటే రెండోదశలో అతివేగంగా వ్యాప్తి చెందుతోంది. అస్వస్థతకు గురయ్యే వారి సంఖ్య తక్కువగానే ఉంటున్నా.. తొలిదశకు, రెండోదశకు ప్రధాన వ్యత్యాసాన్ని మాత్రం గుర్తించారు. ఆసుపత్రుల్లో చేరికలు మొత్తంగా తక్కువే ఉన్నా.. చేరుతున్నవారిలో మాత్రం అత్యధికులు ఐసీయూలో చికిత్స పొందుతున్నవారే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఒక్క గాంధీ ఆసుపత్రిలోనే 108 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 245 మంది, ప్రైవేటులో 734 మంది ఐసీయూలో వెంటిలేటర్‌ చికిత్సల్లో ఉన్నారు. ఈ లెక్కన ఆసుపత్రుల్లో 979 మందికి వెంటిలేటర్‌ చికిత్సలు అవసరమైనట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. తొలిదశతో పోల్చితే ఈ తరహాలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నవారు అధికంగానే ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
 
పరిస్థితి విషమించిన తర్వాత.. 
ప్రభుత్వ ఆసుపత్రులతో పోల్చితే ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో పడకలు నిండిపోతున్నాయి. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 90 శాతానికి పైగా ఐసీయూ పడకల్లో రోగులు చికిత్స పొందుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వీరిలో 25-40 ఏళ్ల లోపు వారు కూడా దాదాపు 40 శాతానికి పైగానే ఉన్నట్లుగా వైద్యనిపుణులు చెబుతున్నారు. లక్షణాలు సోకినా 7-10 రోజుల పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, జలుబు, దగ్గు, జ్వరం పెరుగుతున్నా ఇంటి వద్దనే చికిత్స పొందడం వంటి కారణాలతో ఆరోగ్యం విషమిస్తుండగా, ఆ తర్వాత ఆసుపత్రులకు తీసుకొస్తున్నట్లుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఒక్కసారి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రరూపం దాల్చిన తర్వాత త్వరితగతిన వీరి ఆరోగ్యం విషమిస్తోంది. ఫలితంగా యుక్తవయస్కుల్లోనూ కొవిడ్‌ మృతులు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కొవిడ్‌ సోకినా, లక్షణాలు కనిపిస్తున్నా చికిత్సకు జాప్యం చేసినవారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా ఉంటున్నారని, వీరు మరింత త్వరగా ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఐసీయూలో విషమ స్థితికి చేరుకున్నవారికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయని, రక్తనాళాల్లో గడ్డ కట్టడం, గుండెపోటు, పక్షవాతం వంటివి ఎదురవడం, కంటి చూపు దెబ్బతినడం వంటివి కూడా ఉన్నట్లు వివరిస్తున్నారు.
 
వైరస్‌ బాధితుల్లో ఎక్కువమందిలో పెద్దగా లక్షణాలు లేకపోయినా.. కొందరిలో మాత్రం తీవ్రంగా విరుచుకుపడడానికి కారణాలను అన్వేషించాల్సిన అవసరముందని, వైరస్‌ రూపుమార్చుకొని కొత్తరకం ఏదైనా వ్యాప్తి చెందుతుందేమోననే అంశంపై పరిశోధనలు జరగాలని నిపుణులు చెబుతున్నారు.
 
అజాగ్రత్త వీడాలి.. 
కొవిడ్‌ తగ్గిపోయిందనే భావనతో ప్రజలు కనీస నిబంధనలు పాటించక పోవడం సరికాదని, కచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, కనీస వ్యక్తిగత దూరం పాటించాలని, గుంపుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదని, చేతులను ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాలని, సాధ్యమైనంత వేగంగా ఎక్కువమందికి టీకాలను అందించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలు కనిపించగానే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, జ్వరం తగ్గకుండా లక్షణాలు పెరుగుతుంటే వెంటనే ఆసుపత్రిలో వైద్యుణ్ని సంప్రదించడం చాలా ముఖ్యమని, ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే.. అంత ఎక్కువమందిని ఐసీయూలో చేరకుండా ముందుగానే కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
 
గాంధీ ఆసుపత్రిలో 22 మంది మృతి 
గాంధీ ఆసుపత్రి: గాంధీ ఆసుపత్రిలో రోజురోజుకూ కరోనా మృతులు పెరిగిపోతున్నారు. గురువారం 17 మంది చనిపోగా శుక్రవారం 22 మంది కన్నుమూశారు. మృతుల్లో అయిదేళ్ల బాలుడి నుంచి 29 ఏళ్ల యువకుడు, 90 ఏళ్ల వృద్ధుడి వరకు ఉన్నారు.గత ఏడాది కొవిడ్‌ ఉద్ధృతంగా ఉన్నప్పుడూ ఒక్క రోజులో ఇంతమంది చనిపోలేదని వైద్యులు అంటున్నారు.
 
ఇందుకు ప్రధాన కారణం కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల తీరేనని ఆరోపిస్తున్నారు. ఆరోగ్యపరంగా రోగి పరిస్థితి క్షీణించిన తర్వాత , ఇన్సూరెన్సు సొమ్ము నిండుకుని, ఆర్థికంగా దెబ్బతిన్న తర్వాత గాంధీకి పంపిస్తున్నారని ఇక్కడ చేర్చుకున్నాక కొద్ది సమయానికే రోగులు మరణిస్తున్నారని పేర్కొంటున్నారు. ఇలా వస్తున్నవారినే కాపాడలేకపోతున్నామని, నేరుగా తమ ఆసుపత్రిలో చేరినవారిలో చాలామంది సురక్షితంగా ఇళ్లకు వెళుతున్నారని గాంధీ వైద్యులు చెబుతున్నారు. ఈ ఆసుపత్రి మార్చురీలో ప్రస్తుతం ఖాళీ లేక మృతదేహాలను ప్రత్యేకంగా భద్రపరుస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న కొవిడ్‌ సమాచారంలో మృతుల సంఖ్య అయిదుకు మించడం లేదు. ఇతరవ్యాధులు ఉండి మరణించిన వారిని ఈ లెక్కలో చూపడం లేదని తెలుస్తోంది.
 
ఆఖరి నిమిషంలో చేరడం వల్లే 
చాలామంది రోగులను చివరి క్షణాల్లోనే గాంధీ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నాం. ఇలాంటివారిలో కొందరు మరణిస్తున్నారు. గత రెండ్రోజులుగా ఇక్కడ ఎంతమంది కరోనా బాధితులు చనిపోయారన్న సంఖ్య ప్రస్తుతం నావద్ద లేదు. కరోనాతో నేరుగా మా ఆస్పత్రిలో చేరిన వారు క్షేమంగా ఇళ్లకు వెళ్తున్నారు.