మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (10:20 IST)

అమెరికాలో కట్టు తెంచుకున్న కరోనా... విలవిల్లాడుతున్న స్పెయిన్

అమెరికాలో కరోనా వైరస్ కట్టు తెంచుకుంది. ఫలితంగా అగ్రరాజ్యంలో పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ ప్రాణాంతక వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అమెరికా ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. ఫలితంగా పరిస్థితి ఇపుడు చేయిదాటిపోయింది. 
 
ప్రతి రోజూ భారీ సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క శుక్రవారమే ఏకంగా 32 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు, 24 గంటల వ్యవధిలోనే 1480 మంది మృత్యువాత పడ్డారు.
 
గురువారం రాత్రి 8.30 నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్టు జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. అదేసమయంలో అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 77 వేల 467 కు చేరింది. ఇప్పటిదాకా 7402 మంది చనిపోయారు.
 
ఇకపోతే, స్పెయిన్ కూడా కోరనా దెబ్బకు విలవిల్లాడిపోతోంది. ప్ర‌తిరోజూ అంతకంతకూ క‌రోనా కేసులు పెరిగిపోతుండగా... మరోవైపు జ‌నం పిట్టల్లా రాలిపోతున్నారు. అక్క‌డ‌ మార్చి 14 నుంచి స్పెయిన్‌లో లాక్‌డౌన్‌ అమలవుతున్న కూడా... రోజూ పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 7,134 పాజిటివ్‌గా తేలారు. 
 
ప్రస్తుతం 77,488 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, వీళ్లలో 6,416 మంది పరిస్థితి విషమంగా ఉంది. కరోనా వైరస్‌ వల్ల మార్చి 17 నుంచి రోజూ వందకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. మార్చి 23 నుంచి రోజూ 500కు తక్కువ కాకుండా జనం చనిపోతున్నారు. గత ఐదురోజులుగా చూసుకుంటే దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోతున్నారు.