ఢిల్లీలో పీక్ స్టేజ్‌కు చేరిన కరోనా.. ఒక్క రోజులోనే 131 మంది మృతి
ఢిల్లీలో కరోనా వైరస్ మళ్లీ విజృంభించింది. దీంతో ఢిల్లీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 131 మంది మృతి చెందారు. ఒక్క రోజులో కరోనా కారణంగా మృతి చెందినవారిలో ఇదే అత్యధికం. ఇక గడచిన 24 గంటల్లో కొత్తగా 7,486 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షలను దాటింది.
అలాగే, ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 7,943కు చేరింది. ఢిల్లీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 62,232 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం ఢిల్లీలో 42,458 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,03,084కు చేరింది. ఢిల్లీలో కరోనా కట్టటికి ఇంటింటి సర్వేను చేపట్టారు.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయితే రెండు రోజుల పాటు వెయ్యి లోపు నమోదవగా.. బుధవారం మాత్రం కేసుల సంఖ్య వెయ్యి దాటింది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,058 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,60,834కు చేరుకుంది.
అదేసమయంలో కరోనా కారణంగా తెలంగాణలో నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,419 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 12,682 యాక్టివ్ కేసులున్నాయి. 2,46,733 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదు అయ్యాయి.