గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 25 డిశెంబరు 2021 (15:27 IST)

అమెరికాను వణికిస్తున్న డెల్మిక్రాన్?!! లక్షల్లో ఒమిక్రాన్ కేసులు

'డెల్మిక్రాన్' అని పిలవబడే కొత్త కరోనావైరస్ వేరియంట్ ఇపుడు అమెరికా, బ్రిటన్ దేశాలను వణికిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఐతే ఇలాంటి పుకార్లను పట్టించుకోవద్దని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆరోగ్య నిపుణులు నిర్థారించేవరకూ దీనిగురించి ఆందోళన చెందక్కర్లేదని తెలిపారు. ఐతే అమెరికా, ఇంగ్లండ్ దేశాల్లో డెల్టా-ఒమిక్రాన్ స్పైక్‌ల విస్తరణ వేగంగా వుండటంతో వాటికి డెల్మిక్రాన్ అనే పేరు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

 
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాట్లాడుతూ... 'డెల్‌మిక్రాన్' అని పిలవబడే వేరియంట్ గురించి మన దేశంలో ఎలాంటి సమాచారం లేదన్నారు. ఒమిక్రాన్ కూడా కొత్త వైరస్ కాదనీ, ఇది పరివర్తన చెందిన కరోనావైరస్ అని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సాక్ష్యాల ప్రకారం, దాని ఇన్ఫెక్టివిటీ ఎక్కువగా ఉంది, కానీ లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.

 
భారతదేశంలో మొత్తం 415 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. 115 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 108, ఢిల్లీలో 79, గుజరాత్‌లో 43, తెలంగాణలో 38 కేసులు నమోదయ్యాయి.