భర్తకు కరోనా అని తెలియడంతో బస్సులో దూకి భార్య పరుగో పరుగు.. ఎక్కడ?
ఆ మహిళ కట్టుకున్న భర్తతో కలిసి బస్సెక్కింది. ఆ తర్వాత కొద్దిసేపటికి భర్తకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో బస్సు సిబ్బంది అతన్ని బస్సులో నుంచి దించివేశారు. అంతే.. అప్పటివరకు భర్తతో కలిసివున్న భార్య... భర్తను రోడ్డుపై వదిలివేసి.. బస్సు దిగి దౌడుతీసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కరపలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి కిడ్నీ సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
కాకినాడ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకున్న బాధితుడు గురువారం సాయంత్రం ఆసుపత్రి నుంచి భార్యతో కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు కాకినాడలో ఆర్టీసీ బస్సెక్కాడు. బస్సులో ఆర్టీసీ సిబ్బంది అతడి వివరాలను నమోదు చేసుకున్నారు.
బస్సు కరప చేరుకుంటుందనగా బాధితుడికి కరోనా సోకినట్టు రిపోర్టులు వచ్చాయి. రిపోర్టులు వచ్చేవరకు ఆసుపత్రిలోనే ఉండాలని సూచించినా వినిపించుకోకుండా వారు బస్సెక్కి వచ్చేశారు.
దీంతో వారు ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించగా, వారు బస్సు డ్రైవర్, కండక్టర్‌కు విషయం చెప్పి వారిని బస్సు నుంచి దించేయాలని సూచించారు. అప్పటికే బస్సు కరప మార్కెట్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ భార్యాభర్తలిద్దరినీ దింపేశారు.
అయితే, భర్తతోపాటు బస్సు దిగిన భార్య కనిపించకుండా పోవడంతో బాధితుడు అక్కడే ఉండిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కనిపించకుండా పోయిన అతడి భార్య కోసం గాలిస్తున్నారు.