శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (17:59 IST)

పండుగ సీజన్లలో జాగ్రత్త.. కరోనా మార్గదర్శకాలు పొడిగింపు.. కేంద్రం

కరోనా కేసులు పెరిగే ముప్పు వుందనే కారణంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. రానున్న పండుగ సీజన్లలో కోవిడ్ కేసులు పెరిగే ఛాన్సుండటంతో.. కరోనా మార్గదర్శకాలను వచ్చే నెల చివరి వరకు పొడిగించింది కేంద్రం. పండుగ సీజన్‌లో భారీ వేడుకలు, ఉత్సవాలు జరగకుండా  చూసుకోవాలని, ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
 
ఎప్పటిలాగే టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఓ లేఖలో సూచించారు.
 
జాతీయ స్థాయిలో కరోనా మహమ్మారిపై పరిస్థితులు అదుపులో ఉన్నట్టు కనిపిస్తుందని ఆయన తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుందని వివరించారు. 
 
పండుగ సీజన్‌లో కొన్ని జిల్లాల్లో అవసరమైతే స్థానిక ఆంక్షలు విధించాలని సూచించారు. యాక్టివ్ కేసులు, పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కేసుల పెరుగుదలను మొదట్లోనే కనిపెట్టాలని, వెంటనే కట్టడి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.