గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు.. 65 వేలు దాటిన క్రియాశీలక కేసులు
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత రెండు రోజులతో పోల్చుకుంటే గణనీయంగా తగ్గాయి. ఆదివారం లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 10 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో ఈ కేసుల సంఖ్య 7178గా ఉంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 78342 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వీరిలో 7178 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం దేశంలో 65683 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 16 మంది చనిపోయారు. దీంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 5,31,345కు చేరింది.
కాగా, దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి ఎక్స్ బీబీ 1.16 రకం వేరియంట్ కారణమని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, రోజువారీగా నమోదయ్యే కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించినప్పటికీ ఈ వేరియంట్ అంత శక్తిమంతమైనది కాదని చెప్పారు. అయినప్పటికీ ప్రజలు రద్దీ ప్రదేశాలకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించి వెళ్లాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.