మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (10:47 IST)

'కథక్' మ్యాస్ట్రో బిర్జు మహారాజ్ అస్తమయం

దేశంలో పేరెన్నికగన్న కథక్ నాట్యాచారుడు, మహాపండిట్ బిర్జు మహరాజ్ తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఆయనకు వయసు 83 యేళ్లు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ, డయాలసిస్ చేయించుకుంటూ వచ్చారు. ఆయన సోమవారం ఉదయం ఢిల్లీలోని సాకేత్ ఆస్పత్రిలో కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, బిర్జూ మహారాజ్‌కు గుండెపోటు వచ్చి ఉంటుందని అందువల్లే తుదిశ్వాస విడిచివుంటారని ఆయన మనవరాలు చెప్పుకొచ్చింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలోని ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ అసలు పేరు దుఃఖ్ హరణ్. ఆ తర్వాత ఈ పేరును పండిట్ బ్రహ్మోహన్‌గా మార్చుకున్నారు. ఈ పేరుకు పొట్టిరూపమే బిర్జూ. కథన్ నాట్యాచారుడుగానే కాకుండా, గాయకుడిగా కూడా బిర్జూ మహారాజ్ తనను తాను నిరూపించుకున్నారు. 
 
ఈయన 'దేవదాస్', 'దేడ్ ఇష్కియా', 'ఉమ్రాన్ జాన్', 'బాజీరావ్ మస్తానీ' వంటి బాలీవుడ్ సూపర్ హిట్ మూవీలకు కూడా కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే సినిమా 'చెస్ కే ఖిలాడీ'కి సంగీతం కూడా అందించారు. 'దిల్‌ తో పాగల్ హై', 'దేవదాస్' చిత్రాల్లో మాధురి దీక్షిత్ పాటలకు బిర్జూనే నృత్య దర్శకత్వం వహించారు. 
 
కాగా, ఈయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ, సింగర్ మాలిని అవస్థి తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.