ఊపిరి పీల్చుకుంటున్న భారత్... లక్ష సంఖ్య దిగువకు కరోనా కేసులు
భారత్ ఊపిరి పీల్చుకుంటుంది. దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఇపుడు శాంతిస్తోంది. ఫలితంగా కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. గడచిన 24 గంటల్లో ఈ కేసుల సంఖ్య లక్షకు దిగువకు చేరుకున్నాయి.
అంటే 63 రోజుల తర్వాత తొలిసారి లక్ష కన్నా తక్కువగా రోజువారీ కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో మొన్న 1,00,636 కరోనా కేసులు నమోదు కాగా, సోమవారం 86,498 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఆ ప్రకారంగా, సోమవారం 1,82,282 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,96,473కు చేరింది. మరో 2,123 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,51,309కు పెరిగింది.
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,73,41,462 మంది కోలుకున్నారు. 13,03,702 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 23,61,98,726 మందికి వ్యాక్సిన్లు వేశారు.