న్యూజిలాండ్‌లో 102 రోజుల తర్వాత కరోనా కేసులు.. మళ్లీ ఆంక్షలు
న్యూజిలాండ్‌లో 102 రోజుల తర్వాత ఒక కరోనా కేసు నమోదైంది. జూలై 30న ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి కరోనా బారిన పడినట్టు అధికారులు తెలిపారు. అయితే తాజాగా న్యూజిల్యాండ్‌లో మరో నాలుగు కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు చెప్పారు.
50 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. అతడికి కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు జరపగా.. మరో ముగ్గురికి పాజిటివ్ అని తేలినట్టు అధికారులు తెలిపారు. ఈ నాలుగు కేసులు కూడా ఆక్లాండ్ నుంచి నమోదైనట్టు తెలుస్తోంది.
ఇక దేశంలో మళ్లీ కరోనా కేసులు బయటపడుతుండటంతో ఆక్లాండ్‌లో మళ్లీ ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రధాని జకిందా ఆర్డర్న్ తెలిపారు. కొద్ది రోజుల పాటు మిగతా ప్రాంతాల నుంచి ఆక్లాండ్‌లోకి ఎవరూ రాకుండా నిషేధం విధిస్తున్నామన్నారు.
బుధవారం రాత్రి నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు తమకు కరోనా రాకపోయినా వచ్చినట్టే భావించి అందుకు తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలని జకిందా ఆర్డర్న్ కోరారు.
ఇక ప్రజలు అత్యవసర పనులకు బయటకు వచ్చే సమయంలో తప్పక ఫేస్‌మాస్క్ ధరించాలంటూ ప్రభుత్వం కోరింది. భౌతిక దూరం పాటించడం కష్టం అనుకున్న ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది.