1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (11:59 IST)

కరోనా వైరస్ కట్టడి.. పంజాబ్‌లో ఆరు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ

కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పంజాబ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏ జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందో ఆయా జిల్లాల్లో వైరస్‌ కట్టడికి నైట్‌కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో అమలులోకి తెచ్చిన ప్రభుత్వం.. మరో రెండు జిల్లాల్లో శుక్రవారం నుంచి నైట్‌కర్ఫ్యూ విధించింది. పాటియాలా, లూథియానా నైట్‌ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
రాత్రి 11 గంటల నుంచి ఐదు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుండగా.. ప్రభుత్వ అత్యవసర సేవలతో పాటు ప్రభుత్వ అధికారులు, వైద్యసేవలు, విధుల్లో ఉన్న పోలీసులు, ఆర్మీ సిబ్బందికి ఉత్తర్వుల నుంచి మినహాయింపును ఇచ్చింది. ప్రస్తుతం పంజాబ్‌లో ఆరు జిల్లాల్లో నైట్‌ కర్ఫ్యూ అమలవుతోంది.
 
రాష్ట్రంలో ఇటీవల కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నెల 10న 1,422 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 11న 1,309 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,93,345కు పెరిగాయి. 
 
గత ఐదు వారాల్లో రాష్ట్రంలో 381 మంది మృత్యువాతపడగా.. 20,102 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. పెరుగుతున్న కొవిడ్‌ కేసులపై పంజాబ్‌ గవర్నర్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. రెస్టారెంట్లు, దుకాణాలు, మార్కెట్లలో సామాజిక దూరం పాటించేలా పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు.