సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (10:38 IST)

నైట్ కర్ఫ్యూతో కరోనాకు కట్టడి వేస్తాం : సీఎం శివరాజ్ సింగ్

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు చేస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో రాత్రివేళలలో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం కూడా ముందుగా అప్రమత్తమైంది. కరోనా కట్టడికి నైట్‌ కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్‌ ప్రకటించారు. 
 
గడిచిన రెండు రోజుల్లో పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగడంతో ప్రజలు ఎవరూ, ముఖ్యంగా సరిహద్దు జిల్లాల ప్రజలు మహారాష్ట్రకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొవిడ్‌ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్రలోని ఆయా జిల్లాలకు ఉపాధి, ఇతర అవసరాలకు వెళ్లొద్దని సూచించారు. 
 
కూలీలందరికీ ఉపాధిహామీ కింద పనులు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను తిరిగి అమలు చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితిని బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో, ముఖ్యంగా ఇండోర్‌లో పరిస్థితి దిగజారకుండా ప్రజలు మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
 
జిల్లాల వారీగా కరోనాను ఎదుర్కొనేందుకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తుందని చెప్పారు. భోపాల్, ఇండోర్, మహారాష్ట్రకు దగ్గరగా ఉన్న బేతుల్, చింద్వారా, దిందోరి జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. 
 
ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే విధంగా మళ్లీ లాక్డౌన్‌ విధించాలనుకోవడం లేదని, వైరస్‌ కట్టడికి మార్గదర్శకాలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాన్నారు. సరిహద్దు జిల్లాలైన బుర్హాన్పూర్, ఖండ్వా, ఖార్గోన్, బేతుల్, చింద్వారా, సియోని, బాలాఘాట్‌ జిల్లాలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.