గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2020 (17:31 IST)

కోవిడ్ బారినపడి కోలుకున్నవారికి జాగ్రత్తలు... అతి విశ్వాసం వద్దంటున్న వైద్యులు

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గురువారం కొత్తగా 47,905 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగా ఉంటోంది. మరణాల సంఖ్యా తగ్గుతోంది. అయితే చలికాలంలో వైరస్ మరింత తీవ్రప్రభావం చూపొచ్చన్న ప్రచారం నేపథ్యంలో కోవిడ్ సోకి కోలుకున్నవారు నిర్లక్ష్యంగా ఉండవద్దని.. వైరస్ సోకిన సమయం కంటే ఆ తర్వాత రోజులే ముఖ్యమైనవని వైద్యులు సూచిస్తున్నారు. 
 
రెండోసారి వైరస్ సోకిన వ్యక్తిలో ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్టు ఇటీవల వైద్యులు ధ్రువీకరించారు. జ్వరం, తలనొప్పి, దగ్గు, ఒళ్ళు నొప్పులు, డయేరియా వంటి లక్షణాలు ఇబ్బంది పెట్టినట్టు వైద్యులు చెబుతున్నారు.  
 
ఈ పరిస్థితుల్లో కోవిడ్‌ నుంచి కోలుకోగానే ఇక తాము వైరస్ ను జయించామని.. తమ ఆరోగ్యానికి ఢోకా లేదనే అతివిశ్వాసంతో వ్యవహరించవద్దని, అలా అని మరీ భయపడి కృంగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత నిర్లక్ష్యంగా ఉంటే గుండె, మెదడు, కిడ్నీ వంటి కీలకమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
మన దేశంలో కోవిడ్ రీఇన్ఫెక్షన్‌ కేసులు (COVID Reinfection cases) కూడా అనేక చోట్ల  వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్నంత మాత్రాన దానినుంచి దీర్ఘకాలిక రక్షణ పొందగలిగేంత రోగ నిరోధక శక్తిని పొందినట్లు కాదు. కోవిడ్ యాంటీబాడీలు కొందరిలో మూడు నెలలు, మరికొందరిలో ఆరు నెలలు క్రియాశీలంగా ఉంటాయని అధ్యయనాల్లో వెలుగు చూసినట్టు వైద్యులు గుర్తు చేస్తున్నారు. 
 
అయితే మరి కొంతమందిలో మాత్రం యాంటీబాడీలు తగినంతగా అభివృద్ధి చెందకపోతే మరోసారి ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇన్ఫెక్షన్‌ రాకముందు ఎలా అప్రమత్తంగా ఉన్నారో.. కోలుకున్న తర్వాత కూడా అంతే అప్రమత్తంగా ఉండాల్సి అవసరం ఉంటుంది. ముఖ్యంగా గుండె, కిడ్నీ, మధుమేహం, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్లు అదనపు అప్రమత్తతతో వ్యవహరించాలి.