కోవిడ్ ప్రోటోకాల్ నుంచి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ తొలగిస్తాం : డీఎస్ రాణా
కోవిడ్ చికిత్స ప్రోటోకాల్ నుంచి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌ను తొలగించాలని భావిస్తున్నట్లు సర్ గంగారామ్ ఆసుపత్రి ఛైర్మన్ డీఎస్ రాణా వెల్లడించారు. కొవిడ్-19 చికిత్సలో బాధితులపై ప్రభావం చూపిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు.
తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్లాస్మా చికిత్సను ప్రోటోకాల్స్ నుంచి తొలగించిన విషయం తెల్సిందే. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఏర్పడిన యాంటీబాడీలు రోగులపై ప్రభావం చూపిస్తాయని భావించామని, ఈ క్రమంలోనే ప్లాస్మా థెరపీ చేపట్టామన్నారు. అయితే, ఈ చికిత్సతో బాధితులు కోలుకుంటున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో దాన్ని ప్రోటోకాల్ నుంచి తొలగించామన్నారు.
ప్రస్తుతం కరోనా చికిత్సలో వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్‌కు సంబంధించి అలాంటి ఆధారాలు లేవని, అలాంటి మందులను వాడడాన్ని నిలిపివేయాలని డాక్టర్ రాణా అభిప్రాయపడ్డారు. త్వరలోనే అవన్నీ తొలగించబడుతాయని వెల్లడించారు. ప్రస్తుతం మూడు మందులు మాత్రమే పని చేస్తున్నాయని రాణా తెలిపారు.
దేశవ్యాప్తంగా రెమ్‌డెసివిర్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో డాక్టర్ రాణా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం కోవిడ్-19 కోసం సిఫారసు చేసిన చికిత్స ప్రోటోకాల్స్ నుంచి ప్లాస్మా వాడకాన్ని తొలగించింది.