గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 మే 2021 (12:01 IST)

శిఖర్ ధవాన్ ఆక్సిజన్ సాయం.. శంకర్ రూ.10 లక్షల ఆర్థిక సాయం

కరోనాపై పోరాటం కోసం ఇప్పటికే రూ.20 లక్షలతో పాటు ఈ ఏడాది ఐపీఎల్‌ క్యాష్‌ప్రైజ్‌లను విరాళంగా ఇచ్చిన భారత క్రికెటర్‌ శిఖర్ ధవన్‌ మరోసారి ముందుకొచ్చాడు. వైరస్‌ బాధితులకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను గుర్‌గ్రామ్‌ పోలీసులకు అందించాడు. 'నా ప్రజల కోసం కొంచెమైనా సాయం చేయడం కృతజ్ఞతగా భావిస్తున్నా. ఈ మహమ్మారి నుంచి భారత్‌ త్వరలోనే కోలుకుంటుంది' అని ధవన్‌ ట్వీట్‌ చేశాడు.
 
మరోవైపు, తమిళనాడు రాష్ట్రంలో క‌రోనా తీవ్రంగా విజృంభిస్తుంది. ల‌క్ష‌ల కొల‌ది కేసులు, వేల కొల‌ది మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌డంతో జ‌నాలు గ‌గ్గోలు పెడుతున్నారు. కొంద‌రి ప‌రిస్థితి దిక్కుతోచ‌ని విధంగా ఉంది. క‌రోనా వ‌ల‌న లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో చాలా మంది నిరాశ్ర‌యుల‌య్యారు. 
 
వీరిని ఆదుకునేందుకు సినీ సెల‌బ్రిటీలు న‌డుం క‌డుతున్నారు. అయితే తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తంలో విరాళాలు అందించారు.
 
ఇప్ప‌టికే సూర్య‌, కార్తీ సోద‌రులు కోటి విరాళం అందించ‌గా, మురుగ‌దాస్ రూ.25 ల‌క్ష‌లు, అజిత్ రూ.25 ల‌క్ష‌లు, సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ భ‌ర్త విశాగ‌ణ్ కోటి రూపాయ‌లు, ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ రూ.10 ల‌క్షలు, ఎడిట‌ర్ మోహ‌న్, ఆయ‌న త‌న‌యుడు మోహ‌న్ రాజా, జ‌యం ర‌వి రూ.10 ల‌క్ష‌ల రూపాయ‌లు, త‌మిళ న‌టుడు శివ కార్తికేయ‌న్ విరాళం కింద రూ.25 ల‌క్ష‌లు అందించారు. ఇక తాజాగా ద‌ర్శ‌కుడు శంక‌ర్ రూ.10 ల‌క్ష‌ల రూపాయలను సీఎం పబ్లిక్ రిలీఫ్ ఫండ్ ఖాతాకు బదిలీ చేశారు.