శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 డిశెంబరు 2020 (17:24 IST)

సిడ్నీ ట్వంటీ20 : కోహ్లీ సేన విజయవిహారం - టీ20 సిరీస్ కైవసం

ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయవిహారం చేసింది. ఆసీస్ నిర్ధేశించిన 195 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రాహుల్ (30), ధావన్ (52)లు గట్టి పునాది వేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 5.2 ఓవర్లలో 56 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రాహుల్ 30 పరుగుల వద్ద, ధావన్ 52 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. 
 
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (40), శాంసన్ (10), పాండ్యా (42 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (12 నాటౌట్) చొప్పున మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా, శిఖర్ ధావన్ 36 బంతుల్లో రెండు సిక్స్‌లు 4 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 22 బంతుల్లో 2 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. ఆకర్లో అయ్యర్ కూడా ఐదు బంతుల్లో ఓ సిక్సర్, ఓ ఫోర్ సాయంతో 12 రన్స్ చేశాడు. 
 
అలాగే, విరాట్ కోహ్లీ కూడా 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 40 రన్స్ బాదాడు. ఫలితంగా మరో 2 బంతులు మిగిలివుండగానే 19.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో శామ్స్, టై, స్వీపన్, జంపాలు ఒక్కో వికెట్ చొప్పు తీశారు. దీంతో మూడు ట్వంటీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 
 
అంతకుముందు సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో ట్వంటీ 20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ వేడ్ (58), స్టీవ్ స్మిత్ (46), హెన్రిక్స్ (26), మ్యాక్స్ వెల్ (22) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 రన్స్ చేసింది. 
 
రెగ్యులర్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వేడ్ ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వేడ్ 32 బంతులాడి 10 ఫోర్లు, ఒక సిక్సు బాదాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ అందరూ దూకుడుగా ఆడేందుకు ప్రాధాన్యమివ్వడంతో ఏ దశలోనూ స్కోరుబోర్డు విశ్రమించలేదు.
 
ఇకపోతే, భారత బౌలర్లలో నటరాజన్ మరోసారి రాణించాడు. ఈ తమిళనాడు యార్కర్ స్పెషలిస్ట్ 2 వికెట్లు తీసి తన ఎంపికకు న్యాయం చేశాడు. షమీ, బుమ్రా వంటి అగ్రశ్రేణి బౌలర్ల గైర్హాజరీలో దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్ తేలిపోయారు.