బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (19:12 IST)

స్పుత్నిక్​ వి- తొలి బ్యాచ్‌ టీకా డోసులు మే 1న భారత్‌కు వస్తున్నాయి

స్పుత్నిక్​ వి- తొలి బ్యాచ్‌ టీకా డోసులు మే 1న భారత్‌కు చేరుకోనున్నట్లు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ హెడ్‌ కిరిల్‌ దిమిత్రివ్‌ తెలిపారు. వేసవి చివరినాటికి భారత్‌లో నెలకు 50 మిలియన్‌ డోసుల చొప్పున వ్యాక్సిన్​ ఉత్పత్తి చేసే అవకాశాలున్నట్లు చెప్పారు.
 
రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ 'స్పుత్నిక్‌ వి' అతి త్వరలో దేశానికి రానుంది. తొలి బ్యాచ్‌ టీకా డోసులు మే 1న భారత్‌కు చేరుకోనున్నట్లు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) హెడ్‌ కిరిల్‌ దిమిత్రివ్‌ సోమవారం వెల్లడించారు.

అయితే తొలి కన్‌సైన్‌మెంట్‌లో ఎన్ని టీకాలు ఉండనున్నాయి.. వాటిని ఎక్కడ తయారు చేయనున్నారన్న విషయాలపై ఆయన స్పష్టతనివ్వలేదు. 'మే 1వ తేదీన తొలి డోసులు భారత్‌కు డెలివరీ అవుతాయి' అని ఆయన తెలిపారు. వేసవి చివరినాటికి భారత్‌లో నెలకు 50 మిలియన్‌ డోసుల చొప్పున వ్యాక్సిన్​ ఉత్పత్తి చేసే అవకాశాలున్నట్లు చెప్పారు.
 
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) కొద్ది రోజుల క్రితమే అనుమతించింది. ఆర్‌డీఐఎఫ్‌ సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్‌లో ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు డా. రెడ్డీస్‌ సంస్థతో ఒప్పందం కుదిరింది. అనంతరం రెండు, మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన రెడ్డీస్‌.. ఇటీవల వినియోగ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ ట్రయల్స్‌ ఫలితాన్ని విశ్లేషించిన నిపుణుల కమిటీ.. భారత్‌లో స్పుత్నిక్‌ వి టీకా అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపింది.