సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (16:30 IST)

నాకు కరోనా వస్తే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా?

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనాకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా విషయంలో దేశ ప్రజలను అప్రమత్తం చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పువ్వాడ ఆరోపించారు. భౌతిక దూరం మన దేశంలో సాధ్యంకాదని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా వస్తే వెలివేసే విధానం సమాజంలో ఉందని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. 
 
తనకు కరోనా వస్తే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటానని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. కరోనా కాలంలో బాధ్యత లేని కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పరోక్షంగా కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు. కాగా.. ఇప్పటికే తెలంగాణలోని పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. వారిలో మెజార్టీ నేతలు ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, యాదగిరిరెడ్డి, గొంగిడి సునీత వంటి వాళ్లు ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పువ్వాడ తనకు కరోనా సోకితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాకుండా ప్రభుత్వానికి గాంధీ ఆస్పత్రిలోనే కరోనా చికిత్స తీసుకుంటానని చెప్పడం చర్చనీయాంశమైంది.