అమెరికాలో కరోనా ఉధృతి.. 24 గంటల్లో 2400 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికాను కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2400మందిని ఈ మహమ్మారి బలిగొంది. గత ఆరు నెలల్లో ఒక్క రోజే భారీ సంఖ్యలో మరణించడం ఇదే తొలిసారి అని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ పేర్కొంది. థ్యాంక్స్‌గివింగ్ హాలీడేస్ ప్రారంభమైన ఈ తరుణంలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
గురువారం ఒకే రోజు 2,439 మందిని ఈ వైరస్ పొట్టనబెట్టుకోవడంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 262,080కు చేరింది. అలాగే బుధవారం ఒక్కరోజే సుమారు రెండు లక్షల కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు జనాలు ముఖానికి మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలను ఉల్లంఘించడం కూడా కొత్త కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు.
థ్యాంక్స్‌గివింగ్ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను ప్రజలకు చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే మీరు సాధారణ జీవితం గడపబోతున్నారు.. ఇది జరిగి తీరుతుందని బైడెన్ చెప్పారు.