ఒమిక్రాన్ ఎలాంటిదో చెప్పిన దక్షిణాఫ్రికా వైద్యురాలు...
ఒమిక్రాన్ అంటే అంతా ఇపుడు వణికిపోతున్నారు. కరోనా వైరస్ కొత్త రూపం సంతరించుకుంది. తాజాగా సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ దక్షిణాఫ్రికా దేశంలో ఈ నెల 24న వెలుగులోకి వచ్చింది. కేవలం మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 18 దేశాలకు వ్యాపించింది. ఆస్ట్రేలియా , ఇటలీ , జర్మనీ , నెథర్లాండ్ , బ్రిటన్ , ఇజ్రాయెల్, హాంగ్ కాంగ్ , బోట్స్వానా , బెల్జియం తదితర దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.
అయితే ఈ వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకూ అది లొంగే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే పలు దేశాల్లోని శాస్త్రవేత్తలు మాత్రం ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని చెబుతున్నారు. తాజాగా సౌతాఫ్రికా డాక్టర్ ఏంజిలిక్యూ కాట్జీ ఒమిక్రాన్ లక్షణాలు గురించి వివరించారు. ఒమిక్రాన్ రోగులు విపరీతమైన అలసట, కొద్దిపాటి కండరాల నొప్పి, గొంతులో కొద్ది పాటి గరగర, పొడి దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. కొంత మందిలో మాత్రమే జ్వరం కలుగుతుంది. చికెన్ గున్యా ఒమిక్రాన్ కు చాలా వరకూ ఒకటే లక్షణాలు ఉంటాయని చెప్పారు.
ఇది మునుపటి వేరియంట్‌ల కంటే ఎక్కువ వేగంగా వ్యాపిస్తుంది. ఈ కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికాలో ఇప్పటికే 30 కేసులు నమోదయ్యాయని, మరింతగా కేసులు వెలుగులోకి వస్తున్నాయని డాక్టర్ ఏంజిలిక్యూ కాట్జీ చెప్పారు. ప్రస్తుతానికి కోవిడ్ రోగుల్ని ఇంట్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఏంజిలిక్యూ కాట్జీ తెలిపారు.
ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. కేసులు అత్యధికంగానే బయట పడుతున్నాయి. అయితే ఆస్పత్రులపై భారం పడటం లేదు. 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు, వ్యాక్సిన్ తీసుకోని వారే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇంతవరకు ఈ వేరియెంట్ సోకలేదు. ఎంత ప్రమాదకరమో సంపూర్ణ అవగాహన రావాలంటే మరో 15 రోజులు పడుతుంది అని తెలిపారు.
ఇదే విషయంపై యూకేలోని ఓ శాస్త్రవేత్త మాట్లాడుతూ, ఒమిక్రాన్ వలన మరణాలు తక్కువ అని చెప్పారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నవారికి, గతంలో కరోనా సోకిన వారికి రోగనిరోధక శక్తి పెరిగిన వారికి ఒమిక్రాన్ వేరియెంట్ వలన ప్రమాదం తక్కువ అని చెప్పారు.