గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (10:40 IST)

దేశంలో భారీగా తగ్గిన కొత్త కరోనా పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా అదుపులోకి వచ్చింది. స్వల్ప హెచ్చుతగ్గులతో గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదయ్యే కోవిడ్ కేసుల సంఖ్య పది వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
తాజాగా 1.84 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 5,221 మందికి కరోనా సోకినట్లు కేంద్రం సోమవారం వెల్లడించింది. పాజిటివిటీ రేటు 2.8 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 5,975 మంది కొవిడ్ నుంచి కోలుకొన్నారు. వైరస్‌ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు 47,176(0.11 శాతం)కి తగ్గిపోయాయి. 
 
కాగా, గత 2020 ప్రారంభం నుంచి 4.45 కోట్ల మంది మహమ్మారి బారినపడగా 98.71 శాతం మంది వైరస్‌ను జయించారు. 5,28,165 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 215 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. ఆదివారం 30.76 లక్షల మంది టీకా తీసుకున్నారని కేంద్రం తెలిపింది.