శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (14:03 IST)

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌తో 90 శాతం రక్షణ : ఇంగ్లండ్ ప్రజారోగ్య శాఖ

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనికా ఫార్మా దిగ్గజం కలిసి సంయుక్తంగా తయారు చేసిన కరోనా టీకా వల్ల 90 శాతం మేరకు రక్షణ ఉంటుందని ఇంగ్లండ్ ప్రజారోజ్యం శాఖ వెల్లడించింది. ఆస్ట్రాజెనికా కంపెనీకు చెందిన రెండు డోసుల టీకాలు వేసుకుంటే.. కోవిడ్ నుంచి సుమారు 90 శాతం ర‌క్ష‌ణ ఉంటుంద‌ని తెలిపింది. దీనికి సంబంధించిన డేటాను ప‌బ్లిక్ హెల్త్ శాఖ రిలీజ్ చేసింది. 
 
ఈ నెల 9వ తేదీ నాటికి ఇంగ్లండ్‌లో 60 ఏళ్లు దాటిన‌వారిలో.. సుమారు 13000 మ‌ర‌ణాల‌ను నియంత్రించ‌గ‌లిగిన‌ట్లు ఆ దేశ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఇక వ్యాక్సిన్లు ఇవ్వ‌డం వ‌ల్ల 65 ఏళ్లు దాటిన‌వారిలో సుమారు 40 వేల మంది హాస్పిట‌ల్‌ ఇబ్బందుల నుంచి దూర‌మైన‌ట్లు డేటాలో వెల్ల‌డించారు. 
 
మ‌హ‌మ్మారి క‌రోనా వల్ల ఇంగ్లండ్ భారీ స్థాయిలో మ‌ర‌ణాలు సంభ‌వించాయి. కానీ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ త‌ర్వాత ఆ విప‌త్తు ఆగిన‌ట్లు తెలుస్తోంద‌ని ప‌బ్లిక్ హెల్త్ పేర్కొన్న‌ది. కోవిడ్ 19 నుంచి వ్యాక్సిన్లు మ‌న ప్రాణాలు కాపాడుతాయ‌న్న విష‌యం తాజా డేటా స్ప‌ష్టం చేస్తున్న‌ద‌ని ఆరోగ్య‌శాఖ మంత్రి మ్యాట్ హాన్‌కాక్ తెలిపారు. 
 
కొత్త వేరియంట్లు దాడి చేస్తున్న త‌రుణంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ చాలా కీల‌క‌మైంద‌న్నారు. బ్రిట‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మూడ‌వ వంత జ‌నాభాకు వ్యాక్సిన్లు ఇచ్చారు. వీలైనంత వ‌ర‌కు ఫ‌స్ట్ డోసును ఇచ్చేశారు. ఇక రెండ‌వ డోసు కోసం మాత్రం 12 వారాల‌ గ‌డువును విధించారు. వ్యాక్సిన్ల మ‌ధ్య గ‌డువును పెంచ‌డం వ‌ల్ల‌.. శ‌రీరంలో వైర‌స్‌కు వ్య‌తిరేకంగా ఉత్ప‌త్తి అయ్యే యాంటీబాడీలు 20 నుంచి 300 శాతం వ‌ర‌కు పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తాజా స‌ర్వే అభిప్రాయ‌ప‌డింది.