అమెరికాలో కరోనా కేసులు.. కొత్త రికార్డు.. 3,700 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో రికార్డులపై రికార్డులు నమోదవుతున్నాయి. గత 24గంటల్లో కొత్త కేసులు 2,50,000 దాటగా మరణాలు 3,700 దాటాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాలు వెల్లడించాయి. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు అమెరికాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,07,291గా వుంది. గత నెల రోజులుగా అమెరికాలో కొవిడ్ కేసులు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం ఈ వైరస్‌తో ఆస్పత్రి పాలైన వారి సంఖ్య 1,13,000గా వుంది. అమెరికాలో కరోనా గణాంకాలకు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లో అంకెలకు అస్సలు పొంతన లేకుండా వుంది. అమెరికా జనాభాలో ఐదు శాతం మందికి లేదా దాదాపు కోటీ 70లక్షల మందికి ఈ వైరస్ సోకింది. కాగా అమెరికా ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ ఆరంభించింది. ఈ వారం చివరికల్లా 29లక్షల డోసులను సేకరించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది.
వచ్చే ఏడాదికల్లా వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చేలోగా అమెరికా ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ కుప్పకూలేలా వుందని అమెరికా సిడిఎస్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ ఇప్పటికే హెచ్చరించారు. బైడెన్ వచ్చే వారం వ్యాక్సిన్ తీసుకోనుండగా, ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దంపతులు శుక్రవారం టీకా వేయించుకోనున్నారని వైట్‌హౌస్ ప్రకటించింది.