ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్.. ఐర్లాండ్ ఘన విజయం
అబుదాబి వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. క్రికెట్ పసికూన ఐర్లాండ్ చారిత్రాత్మకమైన గెలుపుని సాధించింది. ఏడు ఓటములకు ముగింపు పలికి తన మొదటి టెస్ట్ మ్యాచ్‌ను గెలుచుకుంది. మూడో రోజు గెలుపునకు అవసరమైన 111 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఐర్లాండ్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు.
కెప్టెన్ ఆండీ బల్బిర్నీ 58 పరుగులతో కడదాక క్రీజులో వుండటంతో విజయం సాధించింది. దీంతో వరుసగా 7 ఓటముల తర్వాత ఐర్లాండ్ తొలి టెస్ట్ విజయాన్ని అందుకుంది.
ఒక దశలో 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో ఐర్లాండ్ శిబిరంలో ఆందోళన కనిపించింది. కానీ కెప్టెన్ బల్బిర్నీ చివరి వరకు క్రీజులో ఉండి జట్టుని గెలిపించాడు.
2018లో పాకిస్థాన్‌తో తొలి టెస్ట్ మ్యాచ్‌ను ఐర్లాండ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. మొత్తానికి 7 ఓటముల తర్వాత విజయాన్ని అందుకుంది. దీంతో 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి విజయాన్ని అందుకున్న నాలుగవ వేగవంతమైన జట్టుగా ఐర్లాండ్ నిలిచింది.
ఆస్ట్రేలియా జట్టు తొలి టెస్టులో విజయం అందుకుంది. ఇంగ్లండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు రెండు మ్యాచ్‌లు, ఇక వెస్టిండీస్ ఆరు మ్యాచ్‌లకు తొలి విజయాలను అందుకున్నాయి.